టీమిండియా హెడ్ కోచ్ గా గంభీర్
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు వెల్లడి
ముంబై – అందరూ ఊహించినట్టుగానే కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు కోచ్ , బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్ ను హెడ్ కోచ్ గా నియమించింది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన ఏకైక క్రీడా సంస్థగా పేరు పొందిన బీసీసీఐకి ఊహించని రీతిలో షాక్ తగిలింది. తమ జట్టుకు హెడ్ కోచ్ కావాలంటూ చేసిన ప్రకటనకు ఆశించిన మేర స్పందన రాలేదు. కేవలం ఇద్దరే ఇద్దరు ఆటగాళ్లు కోచ్ పదవి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇది క్రీడాభిమానులను విస్తు పోయేలా చేసింది. ఇది పక్కన పెడితే భారత జట్టుకు హెడ్ కోచ్ గా విశిష్ట సేవలు అందించిన ది వాల్ రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ముగిసింది.
ఆయన మరోసారి జట్టుకు సేవలు అందించేందుకు సుముఖత వ్యక్తం చేయక పోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. నిలకడతో కూడిన శిక్షణను మాత్రమే అందిస్తూ వచ్చాడు ద్రవిడ్. జట్టుకు మరింత దూకుడు కలిగిన కోచ్ కావాలని భావించింది బీసీసీఐ. ఇదే సమయంలో గౌతమ్ గంభీర్ నేతృత్వంలో ఐపీఎల్ టోర్నీలో కేకేఆర్ జట్టు దుమ్ము రేపింది. ఏకంగా కప్ ను కొట్టింది.
ఇదే సమయంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తనయుడు జే షా బీసీసీఐకి కార్యదర్శి కావడం , ఆయన కనుసన్నలలోనే క్రీడా సంస్థ ఉండడంతో గంభీర్ ఎంపికకు మార్గం ఏర్పడింది. తను కూడా బీజేపీకి చెందిన వాడే. ఒక రకంగా బీసీసీఐ కాదని అది బీజేపీకి అడ్డాగా మారిందంటూ ఆ మధ్యన టీఎంసీ చీఫ్ , బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించింది.