కదిరి మాజీ ఎమ్మెల్యేపై వేటు
గీత దాటారంటూ సస్పెండ్
అమరావతి -తాజాగా రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో తమ పార్టీలోనే ఉంటూ వెన్ను పోటు పొడిచిన వారి జాబితాపై ఫోకస్ పెట్టారు ఆ పార్టీ చీఫ్ , మాజీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. కదిరిలో గీత దాటిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ పీవీ సిద్దారెడ్డిపై వేటు వేశారు.
ఈ మేరకు వైఎస్సార్సీపీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. మాజీ సీఎం ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని తెలిపింది.
డాక్టర్ పీవీ సిద్దారెడ్డి పనిగట్టుకుని టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి అనుకూలంగా పని చేశారని, స్వంత పార్టీలో ఉంటూ వ్యతిరేకంగా పని చేయడం దారుణమని పేర్కొంది. వెంటనే ఆయనను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు తెలిపింది.
ఇక నుంచి సిద్దారెడ్డికి పార్టీకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. మాజీ సీఎం ఎంతగానో అభిమానించడమే కాకుండా ఎమ్మెల్యే పదవి కట్టబెట్టినా చివరకు పార్టీకి నమ్మక ద్రోహం చేయడం బాధాకరమని పేర్కొంది. రాబోయే రోజుల్లో మరికొందరి జాతకాలు బయట పెడతామని, వారిపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది పార్టీ.