సీఎం కామెంట్స్ ఆర్ఎస్పీ సీరియస్
ఒక్కో కోచింగ్ సెంటర్ కు రూ. 100 కోట్లా
హైదరాబాద్ – కోచింగ్ సెంటర్లపై , నిరుద్యోగ అభ్యర్థుల గురించి నోరు పారేసుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అసలు సోయి ఉండే మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఎవరో చెబితే అక్కసుతో మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. ఇకనైనా నిరుద్యోగులను చులకన చేయడం మానుకోవాలని హితవు పలికారు ఆర్ఎస్పీ.
ఒక్కో కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు రూ. 100 కోట్లు సంపాదించడానికి వారు చేసేది మీలా రియల్ ఎస్టేట్ వ్యాపారం కాదంటూ ఎద్దేవా చేశారు. . కావాలంటే మీ పంచన చేరిన రియాజ్ ను అడగండి చెబుతాడంటూ పేర్కొన్నారు. ఇక నిరుద్యోగులను కిరాయి మనుషులనడం మీకే చెల్లు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఆర్ఎస్పీ.
ఆనాడు ఎంపీ రాహుల్ గాంధీని అశోక్ నగర్ కు తీసుకు వచ్చినప్పుడు మీ వెంట వచ్చిన వాళ్లంతా కిరాయి మనుషులేనా అని ప్రశ్నించారు. బుధవారం ట్విట్టర్ వేదికగా నిప్పులు చెరిగారు ఆర్ఎస్పీ. వచ్చిన 90 రోజుల్లో 30 వేల ఉద్యోగాలు ఇచ్చామనడం పూర్తిగా అబద్దమన్నారు. తమరికి ఉద్యోగాల నోటిఫికేషన్ కు, నియామకాలకు తేడా తెలవక పోవడం తెలంగాణ ప్రజల దురదృష్టమని పేర్కొన్నారు.