అన్న ప్రసాదం తయారీ ఆధునీకరణకు చర్యలు
టీటీడీ ఈవో జె.శ్యామల రావు వెల్లడి
తిరుమల – శ్రీవారి భక్తులకు మరింత రుచికరమైన, పరిశుభ్రమైన ఆహారాన్ని అందించడానికి అన్నప్రసాద తయారీ విధానాన్ని ఆధునీకరించాలని దక్షిణ భారతదేశంలోని ప్రఖ్యాత చెఫ్‌లు , పాకశాస్త్ర నిపుణులు టీటీడీకి సూచించారు.
శాఖాపరమైన సమీక్షా సమావేశంలో భాగంగా తిరుమలలోని గోకులం విశ్రాంతి భవనంలోని సమావేశ మందిరంలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, దక్షిణ భారతదేశ అసోసియేషన్ చెఫ్‌లతో కలిసి అన్నప్రసాదం, వంటశాలల ఆధునీకరణ తదితర అంశాలపై టీటీడీ ఈవో జె శ్యామలరావు సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు.
తిరుమలలో శ్రీవారి భక్తులకు అందిస్తున్న అన్నప్రసాదం రుచి, నాణ్యతను మెరుగు పరిచేందుకు ఏర్పాటు చేసిన ప్రముఖ వంటల తయారీ నిపుణుల కమిటీ నుండి పలు సూచనలు, సలహాలు ఆహ్వానించారు.
అంతకు ముందు ఈ కమిటీ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని సందర్శించి, అన్న ప్రసాదాలు వడ్డించడం, నిల్వ చేయడం, శుభ్ర పరచడం తదితర కార్యకలాపాలను పరిశీలించారు.
టీటీడీ ప్రతి రోజు లక్షలాది మంది భక్తులకు అందిస్తున్న అన్న ప్రసాదాలను వారు అభినందించారు. అయితే రోజు రోజుకు పెరుగుతున్న అసంఖ్యాక భక్తుల అవసరాలకు అనుగుణంగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలోని వంటశాలలను ఆధునీకరించాలని తెలిపారు.
అనంతరం చెఫ్ లు, పాకశాస్త్ర నిపుణులు తమ సూచనలను ఈవోతో పంచుకున్నారు. ఇందులో భాగంగా అన్నప్రసాద భవనంలో సేవలందిస్తున్న సిబ్బందికి శిక్షణ ఇవ్వడం ద్వారా వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడం, ఇన్ హౌస్ ల్యాబ్ ల ఏర్పాటు చేసి, తనిఖీ చేయడం, ఆహార పదార్థాల పరిశుభ్రత, వ్యర్థ పదార్థాల నిర్వహణ, పరికరాల యాంత్రీకరణ, ఆహారాన్ని రుచికరంగా, వేగవంతమైన పద్ధతిలో తయారు చేయడం, ప్రతి మూడు నెలలకోసారి ఫుడ్ అనలిస్ట్ వారి సూచనలను తీసుకోవాడం వంటి అనేక సలహాలు అందజేశారు.
ఇందుకు అవసరమైన ఏర్పాట్లపై పక్కా ప్రణాళికను రూపొందించి, అన్నప్రసాద కార్యకలాపాలపై ఆహార నిపుణులతో త్వరలో మరోసారి సమావేశం నిర్వహించనున్నట్లు ఈవో తెలిపారు.