హత్యా రాజకీయాలు మానుకోవాలి
టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు
అమరావతి – తెలుగుదేశం పార్టీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు నిప్పులు చెరిగారు. ప్రజలు ఛీ కొట్టినా వైసీపీ గూండాలకు బుద్ది రావడం లేదన్నారు. అనంతపురం జిల్లాలో హత్యల పరంపర కొనసాగుతుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం పల్లా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.
జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త ఆదెప్పను పొట్టన పెట్టుకున్నారంటూ ఆరోపించారు. రాయదుర్గం మండలం మెచ్చరికి చెందిన గొల్ల ఆదెప్పను హత్య చేయడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకకు పని మీద తిరిగి వస్తుండగా మాటు వేసిన వైసీపీ కార్యకర్తలు అత్యంత దారుణంగా హత్య చేశారని వాపోయారు పల్లా శ్రీనివాసరావు.
యథా లీడర్ తథా క్యాడర్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి బాటలోనే వైసీపీ రౌడీ మూకలు పయనిస్తున్నాయని ఆరోపించారు. అరాచకపాలనను భరించలేక ప్రజలు ఛీకొట్టినా మాజీ సీఎం మరణ శాసనం రాస్తూనే ఉన్నాడని మండిపడ్డారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకూ 9 మంది టీడీపీ కార్యకర్తలను పొట్టన పెట్టుకున్నారని వాపోయారు. గ్రామంలో ఆలయ అర్చకత్వం విషయంలో ఆదెప్పతో గొడవ పడిన వైసీపీ కార్యకర్తలు అతనిపై కక్ష పెట్టుకుని మాటు వేసి హతమార్చారని తెలిపారు. మృతుని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియ చేస్తున్నామని, ఆయన కుటుంబాన్ని తప్పక పార్టీ ఆదుకుంటుందని చెప్పారు.