జర్నలిస్టులపై జులుం తగదు
ఖాకీల తీరుపై తన్నీరు కన్నెర్ర
హైదరాబాద్ – రాష్ట్రంలో పోలీసులు అనుసరిస్తున్న తీరు పట్ల మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న నిరుద్యోగుల పట్ల కక్ష సాధింపుతో వ్యవహరించారని, ఇప్పుడు వారికి సంబంధించిన సమస్యను ఎత్తి చూపించే బాధ్యతను భుజాన వేసుకున్న జర్నలిస్టుల పట్ల అణిచివేత ధోరణి అవలంభించడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బుధవారం ట్విట్టర్ వేదికగా తన్నీరు హరీశ్ రావు స్పందించారు. మీడియాకు ఎలాంటి ఇబ్బందులు అంటూ ఉండవని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఏడు నెలలు కానే లేదు తన నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నాడని మండిపడ్డారు.
చరిత్రలో ప్రజలతో, మీడియాతో పెట్టుకున్న వాళ్లు బతికి బట్ట కట్టిన దాఖలాలు లేవన్నారు. నేనే సుప్రీం అనుకున్న నేతలు కాల గర్భంలో కలిసి పోయిన విషయం గుర్తు పెట్టుకుంటే మంచిదని హితవు పలికారు.
ఉస్మానియా యూనివర్శిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు అనుసరిస్తున్న వైఖరిని ఆయన తప్పు పట్టారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదని సూచించారు.