ఆర్టీసీ జాబ్స్ ప్రకటన అబద్దం
నమ్మ వద్దని కోరిన ఎండీ సజ్జనార్
హైదరాబాద్ – టెక్నాలజీ పెరిగి పోవడంతో ఫేక్ న్యూస్ కూడా పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఏకంగా జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదలైందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడంతో ఒక్కసారిగా విస్తు పోయారు సదరు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు పొందిన వీసీ సజ్జనార్.
బుధవారం ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఇప్పటి వరకు తాము అలాంటి ఆలోచన ఏదీ చేయలేదని పేర్కొన్నారు. తాము ఒకవేళ జాబ్స్ కు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేస్తే అధికారికంగా మీడియా ముందు వెల్లడిస్తామని స్పష్టం చేశారు ఎండీ.
తమ సంస్థలో 3035 కొలువు ల భర్తీకి సంబంధించి కసరత్తు చేస్తున్నామని, నోటిఫికేషన్ విడుదలైందని , ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలంటూ కొన్ని లింక్ లు తెగ హల్ చల్ చేస్తున్నాయంటూ తెలిపారు సజ్జనార్.
అంతే కాకుండా అందులో ఉద్యోగార్థుల అర్హతలు, దరఖాస్తు ఫీజు, తదితర వివరాలను పేర్కొన్నారంటూ తెలిపారు. వీటిని నమ్మ వద్దని తాము ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ విడుదల చేయలేదని చెప్పారు.