మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలి
స్పష్టం చేసిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం సచివాలయంలో రహదారుల నిర్మాణానికి సంబంధించి సమీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ
రహదారుల నిర్మాణానికి అవసరమైన భూ సేకరణలో బాధితులకు చెల్లించే పరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయాలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
శాశ్వతంగా భూములు కోల్పోవాల్సి వస్తున్నందున వారికి పరిహారం గరిష్ట స్థాయిలో ఉండే విధంగా చూడాలని అన్నారు. జాతీయ రహదారుల నిర్మాణంలో ఎదురవుతున్న వివిధ సమస్యలపై దృష్టి సారించి తక్షణం వాటిని పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం.
అధికారులు ప్రస్తావించిన అంశాలపై తక్షణం స్పందించారు సీఎం. రహదారుల పురోగతి, ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారుల నిర్మాణంలో ఉన్న పలు జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ నెలాఖరులోగా పూర్తి వివరాలతో పాటు ప్రతిపాదనలను సమర్పించాలని స్పష్టం చేశారు సీఎం. తెలంగాణ రీజినల్ రింగ్ రోడ్డు, మంచిర్యాల – వరంగల్ – ఖమ్మం – విజయవాడ కారిడార్ భూ సేకరణ పురోగతిపై అధికారులకు సూచనలు చేశారు రేవంత్ రెడ్డి.