NEWSANDHRA PRADESH

బీపీసీఎల్ రాక‌తో భారీగా కొలువులు

Share it with your family & friends

రూ. 70 వేల కోట్ల పెట్టుబ‌డి

అమ‌రావ‌తి – ఏపీ రాష్ట్రానికి బంప‌ర్ ఆఫర్ ఇచ్చింది కేంద్ర స‌ర్కార్. ఇప్ప‌టికే మోడీ బీజేపీ సంకీర్ణ ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌క పాత్ర పోషిస్తున్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. ఈ మేర‌కు ఆయ‌న మ‌రోసారి చ‌క్రం తిప్పే ప‌నిలో బిజీగా మారారు. సాధ్య‌మైనంత మేర ఏపీకి మ‌రిన్ని నిధులు తీసుకు రావాల‌నే ల‌క్ష్యంతో ముందుకు సాగుతున్నారు.

ఏపీకి ప్ర‌త్యేక హోదా కావాల‌ని ఆయ‌న కోరుతున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ ప్రాజెక్టులు, ప‌నులు, నిధుల‌ను వెంట‌నే మంజూరు చేయాల‌ని కోరుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి విన్న‌వించారు. దీనికి సానుకూలంగా స్పందించారు పీఎం.

ఇదిలా ఉండ‌గా ప్ర‌భుత్వానికి తీపి క‌బురు చెప్పింది ప్ర‌ముఖ సంస్థ భార‌తీయ పెట్రోలియం కార్పొరేష‌న్ లిమిటెడ్ (బీపీసీఎల్). ఏపీలో కొత్త ప్రాజెక్టులు చేప‌ట్టేందుకు గాను రూ. 70 వేల కోట్లు కేటాయించనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ విష‌యాన్ని ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి టీజీ భ‌ర‌త్ వెల్ల‌డించారు.

ఈ పెట్టుబడిలో చమురు శుద్ధి కర్మాగారం కూడా ఉంద‌న్నారు. అమరావతిలోని సచివాలయంలో బీపీసీఎల్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ జి కృష్ణకుమార్‌, ముఖ్యమంత్రి ఎన్‌ చంద్రబాబు నాయుడు మధ్య కీల‌క స‌మావేశం జ‌రిగింది.

భేటీ అనంత‌రం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు మంత్రి టీజీ భ‌ర‌త్. దీని వ‌ల్ల ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా క‌నీసం 25 వేల మందికి పైగా జాబ్స్ వ‌స్తాయ‌ని వెల్ల‌డించారు.