బీఆర్ఎస్ బాట లోనే కాంగ్రెస్ పాలన
బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్ – భారతీయ జనతా పార్టీ శాసన సభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ మీడియా హాలులో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో చీకటి పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన 3 వేల కోట్ల రూపాయల నిధులను పక్కదారి పట్టించారని ఆరోపించారు. శోధ, గజా, కేఎన్ఆర్ కంపెనీలకు కాంట్రాక్టు పనులు అప్పగించారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి 400 కోట్ల రూపాయల పనులు చేస్తున్నారని షాకింగ్ కామెంట్స్ చేశారు.
మెగా కృష్ణారెడ్డి కి 11 వందల కోట్ల రూపాయల పనులు అప్పగించారని ఫైర్ అయ్యారు. విచిత్రం ఏమిటంటే అధికారులు తయారు చేయాల్సిన అంచనాలను కాంట్రాక్టర్లే తయారు చేసి ఇస్తుండడం దారుణమన్నారు ఏలేటి మహేశ్వర్ రెడ్డి.
రూ. 600 కోట్లతో అయ్యే పనికి వెయ్యి కోట్ల రూపాయలుగా అంచనాలు తయారు చేశారని, కాంట్రాక్టర్లు 30 నుంచి 35 శాతం తక్కువ వేసి టెండర్లు దక్కించు కుంటున్నారని ధ్వజమెత్తారు. ఒక్క జీవోకు సంబంధించిన వివరాలను పబ్లిక్ డొమైన్ లో పెట్టడం లేదని మండిపడ్డారు. కేంద్ర సర్కార్ నిధులను దుర్వినియోగం చేశారని, గత బీఆర్ఎస్ బాటలోనే ప్రస్తుతం కాంగ్రెస్ పాలన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.