విశాఖ స్టీల్ ప్లాంట్ ను రక్షిస్తాం
కేంద్ర మంత్రి కుమార స్వామి
విశాఖపట్నం – కేంద్ర పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్ డి కుమార స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ నగరానికే తలమానికంగా నిలిచిన విశాఖ స్టీల్ ప్లాంట్ ను మూసి వేస్తున్నారని, ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీకి చెందిన మంత్రులు, ఎంపీలు.
ఇదిలా ఉండగా గురువారం కేంద్ర మంత్రి హుటా హుటిన విశాఖను సందర్శించారు. అనంతరం ఎంపీ భరత్ తో కలిసి విశాఖ ఉక్కు పరిశ్రమను సందర్శించి పరిస్థితిని అంచనా వేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని, ఆ విషయం కేంద్రానికి తెలుసన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని రక్షించడం తమ బాధ్యత అని స్పష్టం చేశారు కుమార స్వామి. ప్లాంట్ లోని వివిధ విభాగాలను పరిశీలించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ఎన్నో కుటుంబాలు బతుకుతున్నాయని చెప్పారు.
ప్లాంట్ మూత పడుతుందని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో ప్లాంట్ లో వంద శాతం సామర్థ్యంతో ఉత్పత్తి జరుగుతుందని భరోసా ఇచ్చారు. మరోవైపు స్టీల్ ప్లాంట్ లో కుమారస్వామిని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కలిశారు.