ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ రిజైన్
జగన్ కు షాక్ ఇచ్చిన కొమ్మినేని శ్రీనివాస్ రావు
అమరావతి – ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ రావు సంచలన ప్రకటన చేశారు. సీఆర్ మీడియా అకాడమమీ చైర్మన్ పదవికి వ్యక్తిగత కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 16 వరకు సెలవులు ఉన్నాయని, ఈనెల 17 నుంచి తన రిజైన్ అమలులోకి వస్తుందన్నారు కొమ్మినేని.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తనపై నమ్మకం ఉంచి కేబినెట్ హోదాతో మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించారని , పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు కీలక ప్రకటన విడుదల చేశారు.
2022 నవంబర్ 10వ తేదీన తాను చైర్మన్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 13 నెలల 15 రోజుల కాలంలో పూర్తిగా శాయ శక్తులా కృషి చేశానని స్పష్టం చేశారు కొమ్మినేని శ్రీనివాస్ రావు. జర్నలిస్టుల కోసం అనేక కార్యక్రమాలు అమలు చేయడం జరిగిందని తెలిపారు.
గ్రామీణ, పట్టణ జర్నలిస్టులు, జర్నలిజం పై అభిరుచి కలిగిన వ్యక్తుల కోసం మీడియా అకాడమీ ఆధ్వర్యంలో జర్నలిజం లో డిప్లమో కోర్సును నాగార్జున యూనివర్సిటీ సహకారంతో పూర్తి చేయడం తనకు అత్యంత సంతృప్తినిచ్చిన విషయంగా పేర్కొన్నారు.
డిప్లమో కోర్సు తో పాటు ప్రతి శనివారం వర్కింగ్ జర్నలిస్టుల కోసం సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక అంశాల పై ఆన్ లైన్ శిక్షణ తరగతులు నిర్వహించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి, ముఖ్యమంత్రి ప్రవేశ పెట్టిన పాలనా సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలు పత్రికా ముఖంగా ప్రజలకు వివరించగలిగామని ఆయన పేర్కొన్నారు.