ఆటంకం లేకుండా విద్యుత్ సరఫరా
ఏపీ మంత్రి గొట్టిపాటి రవి కుమార్
అమరావతి – రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు ఏపీ మంత్రి గొట్టిపాటి రవి కుమార్. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని పాలించిన జగన్ మోహన్ రెడ్డి సర్కార్ అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసిందన్నారు. ప్రాజెక్టులు, ఎత్తిపోతల పథకాలను పట్టించుకోక పోవడంతో ఇవాళ రైతులు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందన్నారు.
ఈ మేరకు తాగు, సాగు నీటికి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారని తెలిపారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. పంట కాలువలు పూడికలు తీయడం దగ్గరి నుంచి రోడ్లు మరమ్మత్తు చేయడం వరకు ఏ చిన్న పని కూడా పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు.
వీటన్నింటిని తాము పరిగణలోకి తీసుకున్నామని, రాబోయే వర్షా కాలంలో రైతన్నలు ఎటువంటి ఇబ్బంది ఎదుర్కోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు చర్యలు చేపట్టామన్నారు గొట్టిపాటి రవికుమార్. పొలాలకు అవసరమైన విద్యుత్ సరఫరా జరిగేలా కొత్త ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు కూడా ప్రయత్నాలు మొదలు పెడుతున్నామని చెప్పారు. వర్షాలు ప్రారంభం కాక ముందే ఈ పనులు పూర్తి చేసే విధంగా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.