బీటెక్ పానీ పూరీ వాలీ వైరల్
తాప్సీ ఉపాధ్యాయ్ సెన్సేషన్
న్యూఢిల్లీ – ఎవరీ తాప్సీ ఉపాధ్యాయ్ అనుకుంటున్నారా. మోస్ట్ పాపులర్ పానీ పూరీ వాలా. న్యూఢిల్లీలో ఎవరిని అడిగినా ఇట్టే చెప్పేస్తారు ఆమె గురించి. బీటెక్ పానీ పూరీ వాలీ దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఆమె వయస్సు 22 ఏళ్లు మాత్రమే. సోషల్ మీడియాలో తాప్సీ ఇప్పుడు ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
ఒక్క ఇన్ స్టా గ్రామ్ లోనే ఆమెకు మిలియన్ల కొద్దీ ఫ్యాన్స్ ఉన్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. తమ తమ రంగాలలో గెలుపు కావాలంటే తనను చూసి నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరు కలలు కంటారు. కానీ వాటిని సాధ్యం చేసుకోవడంలో కొందరే సక్సెస్ అవుతారు.
మీకంటూ ఓ కల అంటూ ఉంటే దానిని నెరవేర్చాలన్న సంకల్పం గట్టిదైతే మీరు తప్పకుండా విజయం వాకిట్లోకి చేరుకుంటారంటూ ఆత్మ విశ్వాసంతో చెబుతోంది తాప్సీ ఉపాధ్యాయ్. ఆమెను తాప్సీ అని ఎవరూ పిలవరు..పానీ పూరీ ఇష్టపడే వారంతా బీటెక్ పానీ పూరీ వాలీ అంటారు.
తను తాజాగా షేర్ చేసిన వీడియోను మిలియన్ల కొద్దీ చూశారు. కామెంట్స్ చేశారు. తన పానీ పూరీ స్టాల్ తో రాయల్ ఎన్ ఫీల్డ్ మోటార్ బైక్ ను నడుపుతుండడం విశేషం. ఆరోగ్యకరమైన భారతీయ వీధి ఆహారాన్ని అందించడమే తన లక్ష్యంగా చెబుతోంది.