పవర్ లో లేకున్నా పోరాటం ఆపం
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి
అమరావతి – రాష్ట్రంలో అధికారంలో లేక పోయినప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేస్తామని స్పష్టం చేశారు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. ఏనాడూ పవర్ కోసం తాను ప్రయత్నం చేయలేదన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గంలోని మనుబోలు మండల కేంద్రంలో భారీగా విచ్చేసిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు మాజీ మంత్రి. ఈ నియోజకవర్గ ప్రజలకు తాను రుణపడి ఉంటానని, తనను రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు కాకాణి గోవర్దన్ రెడ్డి.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్న నాయకులకు, కార్యకర్తలకు, నియోజకవర్గ ప్రజలందరికీ అండగా నిలుస్తామని చెప్పారు. కుటుంబాన్ని ప్రాతిపదికగా తీసుకొని దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి సంక్షేమ పథకాలు అందించారని తెలిపారు.
మాజీ సీఎం తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి కుటుంబంలోని ప్రతి సభ్యునికి సంక్షేమ పథకాలు అందే విధంగా పరిపాలనను అందించారని చెప్పారు కాకాణి గోవర్దన్ రెడ్డి.
చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన మాటను పక్కన పెట్టి, మోసం చేయబోతున్నాడని నెల రోజుల పాలనలోనే తేట తెల్లమైందని ఆరోపించారు.
ఇసుక ఉచితం అనేది బక్వాస్ అని కొట్టి పారేశారు. అది ప్రజల కోసం కాదని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలకు అడ్డంగా దోచి పెట్టేందుకేనని ఎద్దేవా చేశారు.