డేటా సైన్స్ తో ప్రజా రవాణా వ్యవస్థ పటిష్టం
టీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్
హైదరాబాద్ – డేటా సైన్స్ ను ఉపయోగించుకుని ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా పటిష్టం చెయొచ్చని డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ ప్రముఖ నిపుణులు శరత్ కాటిపల్లి అన్నారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా మెరుగైన, నాణ్యమైన రవాణా సేవలను అందించడంతో పాటు టీజీఎస్ఆర్టీసీ నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు డేటా విశ్లేషణ దివ్య ఔషధంలాగా పనిచేస్తుందని పేర్కొన్నారు.
హైదరాబాద్ బస్ భవన్ లో లీడర్ షిప్ టాక్స్ లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ‘ప్రజా రవాణా వ్యవస్థలో డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ వినియోగం’ అనే అంశంపై శరత్ కాటిపల్లి ప్రసగించారు. ప్రతి రోజు సగటున 55 లక్షల మందిని తమ బస్సుల్లో టీజీఎస్ఆర్టీసీ గమ్య స్థానాలకు చేర్చడం గొప్ప విషయమని అన్నారు. వారి ప్రయాణ డేటాకు అనుగుణంగా రియల్ టైంలో మెరుగైన రవాణా సేవలను అందించవచ్చని చెప్పారు.
మెసేజ్, మెసేంజర్, మెకానిక్స్, మెషినరీ అనే 4ఎం కాన్సెప్ట్ తో సంస్థను ఉన్నత స్థాయికి ఎలా తీసుకువెళ్లోచ్చో వివరించారు. సాంకేతికతలో వస్తోన్న మార్పులను అందిపుచ్చుకుంటూ ప్రయాణికులకు సంతృప్తికర సేవలను అందించే తీరును తన అనుభవంతో ఉదాహరించారు. అనంతరం ఆర్టీసీ అధికారులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలిచ్చారు.
తెలంగాణకు చెందిన శరత్ కాటిపల్లి.. కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్స్ డిగ్రీని అమెరికాలో చేశారు. అలాగే, ప్రముఖ స్టాన్ ఫర్డ్ యూనివర్శిటీలో డేటా సైన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ కోర్సును అభ్యసించారు. అనంతరం మల్టీ నేషనల్ సంస్థలైన లెక్స్ మార్క్, జీఏపీ ఐఎన్సీ, ఐబీఎం గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్, హెచ్ఎస్బీసీ, అమెజాన్ లాంటి సంస్థల్లో డేటా సైంటిస్ట్ గా విధులు నిర్వర్తించారు. జేపీ మోర్గాన్ కార్పొరేట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ సంస్థకు చీఫ్ డేటా ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ సంస్థ లూషియా ఏఐకి అడ్వైజర్ గా కొనసాగుతున్నారు.
డేటా సైన్స్ ను వినియోగించుకుని ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీజీఎస్ఆర్టీసీ కసరత్తు చేస్తోందని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ అన్నారు. ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలకు జీవనాడిలాగా డేటా సైన్స్ పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజల రవాణా అవసరాలకు అనుగుణంగా అర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో వేగవంతమైన సేవలందించేందుకు డేటా విశ్లేషణను వినియోగించు కుంటున్నామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సీవోవో డాక్టర్ రవిందర్, జాయింట్ డైరెక్టర్ అపూర్వ రావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మునిశేఖర్, కృష్ణకాంత్, ఫైనాన్స్ అడ్వజర్ విజయపుష్ఫ, సీపీఎం ఉషారాణి, సీఎంఈ వెంకన్న, తదితరులతో పాటు వర్చ్ వల్ గా ఆర్ఎంలు, డిప్యూటీ ఆర్ఎంలు, డీఎంలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.