ఘనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడి ఉత్సవం
ఘనంగా సాక్షాత్కార వైభవోత్సవాలు
తిరుపతి – శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాలకట్ల సాక్షాత్కార వైభవోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండో రోజైన గురువారం రాత్రి స్వామి వారు హనుమంత వాహనంపై భక్తులకు అభయమిచ్చారు.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్ర నామార్చన నిర్వహించారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు కల్యాణ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరి నీళ్లతో అభిషేకం చేశారు.
అనంతరం రాత్రి 7 గంటల నుండి హనుమంత వాహనంపై స్వామి వారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించారు. జూలై 12న గరుడ వాహనసేవ జరుగనుంది.
ఈ కార్యక్రమంలో ఆలయ ప్రత్యేక శ్రేణి డెప్యూటీ ఈవో వరలక్ష్మి, ఏఈవో గోపీనాథ్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలు భక్తులు పాల్గొన్నారు.