తమిళనాడులో లా అండ్ ఆర్డర్ విఫలం
సీఎంపై నిప్పులు చెరిగిన కె. అన్నామలై
తమిళనాడు – రాష్ట్రంలో రోజు రోజుకు శాంతి భద్రతలు క్షీణిస్తున్నా సీఎం ఎంకే స్టాలిన్ పట్టించు కోవడం లేదంటూ సీరియస్ అయ్యారు భారతీయ జనతా పార్టీ చీఫ్ అన్నామలై కుప్పు స్వామి. శుక్రవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు. రోజు రోజుకు హత్యలు చేసే హంతక ముఠాలు పెరిగి పోయాయని ఇది తీవ్ర ఇబ్బందులను, ఆందోళనను కలిగిస్తోందని పేర్కొన్నారు.
ప్రధానంగా మధురైలో వృద్ధ మహిళలను టార్గెట్ చేసి చంపే ట్రెండ్ పెరిగి పోవడం విస్మయం కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు కె. అన్నామలై. గత వారంలో ముగ్గురు వృద్ధ తల్లులు మాత్రమే హత్యకు గురయ్యారని తెలిపారు. తాజాగా 70 ఏళ్ల ముత్తులక్ష్మి హత్య తమిళనాడులో ప్రజా భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తిందన్నారు.
తమిళనాడు ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడే స్థితి నెలకొందని అసలు సీఎం ఉన్నారో లేదో తెలియడం లేదని పేర్కొన్నారు కె. అన్నామలై. ప్రత్యర్థి పార్టీలపై ప్రతీకారం తీర్చుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉపయోగించు కుంటోందని ఆరోపించారు.
రాష్ట్రంలో నెలకొన్న అభద్రతా పరిస్థితిని గ్రహించి శాంతి భద్రతల పరిరక్షణకు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిఎంకె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కుప్పు స్వామి అన్నామలై.