రహదారుల నిర్మాణం వేగవంతం చేయాలి
ఆదేశించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల మరమ్మత్తుపై దృష్టి సారించాలని స్పష్టం చేశారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. శుక్రవారం సచివాలయంలో రోడ్లు భవనాల శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రోడ్ల దుస్థితి, నిధుల అవసరం, ప్రస్తుతం ఉన్న సమస్యలపై సీఎంకు అధికారులు వివరించారు.
రాష్ట్రంలో 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతలు ఉన్నాయని, తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు మరో 2,936 కిలోమీటర్లు మేర ఉన్నాయని వివరించారు. మొత్తంగా రాష్ట్రంలో 7,087 కిలోమీటర్ల పరిధిలో తక్షణం పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని, వీటి కోసం కనీసం రూ.300 కోట్ల నిధులు అవసరం అని తెలిపారు.
గుంతలు పూడ్చే పనులు వెంటనే చేపట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. అత్యవసరంగా బాగు చేయాల్సిన రోడ్లపైనా దృష్టి పెట్టాలని సూచించారు. రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త, మెరుగైన సాంకేతికతను వినియోగించే విషయంపై తిరుపతి ఐఐటి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు, ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులతో చర్చించారు.
ఈ కీలక సమావేశంలో ఆర్ అండ్ బీ శాఖా మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి, ఆ శాఖ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు సమీక్షలో పాల్గొన్నారు.