DEVOTIONAL

నాకు ప్రాణ భిక్ష పెట్టింది వెంక‌టేశ్వ‌రుడే

Share it with your family & friends

స్వామి ఆశీస్సుల‌తో అభివృద్ది చేస్తా

అమరావ‌తి – ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. తాను ఇవాళ బ‌తికి ఉన్నానంటే దానికి ప్ర‌ధాన కార‌ణం తిరుమ‌ల కొండ‌పై కొలువు తీరిన శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామియేన‌ని చెప్పారు. స్వామి వారే త‌న‌కు ప్రాణ భిక్ష ప్ర‌సాదించింది శ్రీ‌వారేన‌ని, లేక‌పోతే ఇవాళ ఈ భూమి మీద ఉండే వాడిని కాన‌ని అన్నారు.

శ‌నివారం మంగ‌ళ‌గిరిలోని కొలనుకొండ వేంకటేశ్వర స్వామి ఆలయంలో అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు. ఆయ‌న‌కు ఘన స్వాగతం పలికారు హరే కృష్ణ నిర్వాహకులు. పూజా కార్యక్రమాల్లో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంత‌రం శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామికి పూజ‌లు చేశారు .

ఈ సంద‌ర్బంగా ప్ర‌సంగించారు నారా చంద్ర‌బాబు నాయుడు. స్వామి సాక్షిగా తాను ప్ర‌క్షాళన‌కు శ్రీ‌కారం చుట్టాన‌ని చెప్పారు. ప్రతి రోజు తాను వెంకటేశ్వర స్వామికి దండం పెట్టుకుని, తెలుగు జాతికి సేవ చేయటానికి, పేదరికం లేకుండా చేయటానికి, శక్తి సామర్ధ్యాలు ఇవ్వమని కోరుకుంటాన‌ని చెప్పారు.

అక్షయ పాత్ర ద్వారా తాము పేదల కడుపు నింపేందుకు అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేశామ‌న్నారు. కానీ జ‌గ‌న్ రెడ్డి స‌ర్కార్ కావాల‌ని ప‌క్క‌న పెట్టింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ పేద‌ల కోసం అన్న క్యాంటీన్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ప్ర‌క‌టించారు నారా చంద్ర‌బాబు నాయుడు.

ఈ కార్య‌క్ర‌మంలో మాజీ సీజేఐ జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌, అక్ష‌య పాత్ర అంత‌ర్జాతీయ చీఫ్ మ‌ధు పండిత్, మంత్రులు, ఎంపీ పాల్గొన్నారు.