మైనర్ బాలిక ఘటనపై మంత్రి ఆరా
విచారణ వేగవంతం చేయాలని ఆదేశం
అమరావతి – ఏపీ రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత సీరియస్ అయ్యారు. తాజాగా ముచ్చుమర్రి లో జరిగిన మైనర్ బాలిక ఘటనపై ఆరా తీశారు. ఈ సందర్బంగా ఆమె డీజీపీతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటూ వాకబు చేశారు.
ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విచారణను వేగవంతం చేయాలని హోం శాఖ మంత్రి ఆదేశించారు. శాంతి భద్రతలకు భంగం కలగకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో గత కొంత కాలం నుంచి అత్యాచారాలు, హత్యలకు నెలవుగా మారిందని, దీనిని అరికట్టేందుకు తాము ప్రయత్నం చేస్తామని ఇప్పటికే స్పష్టం చేశారు వంగలపూడి అనిత.
ఆమె హొం శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే దూకుడు పెంచారు. వరుసగా సమీక్షలు చేస్తూనే పోలీసు శాఖను అప్రమత్తం చేశారు. ఇదే సమయంలో రాష్ట్రాన్ని డ్రగ్స్ రహిత ప్రాంతంగా చేస్తామని ప్రకటించారు. ఇదే సమయంలో ఎవరైనా సరే డ్రగ్స్ కు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేశారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని డీజీపీని ఆదేశించారు వంగలపూడి అనిత.