సేవలందించేందుకు కొత్త వ్యవస్థ
ఏర్పాటు చేయాలన్న సీఎం రేవంత్
హైదరాబాద్ – ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ మహానగర పరిధిలో ప్రజలకు నిత్యం సేవలు అందించాల్సిన విభాగాలన్నీ ఒకే గొడుకు కింద మరింత పటిష్ట వంతంగా పనిచేసేలా “హైడ్రా” విధి విధానాలను రూపొందించాలని ఆదేశించారు.
జాతీయ విపత్తుల నిర్వహణ చట్టానికి అనుగుణంగా ఈ కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీతో పాటు, హెచ్ఎండిఏ, వాటర్ బోర్డు, విజిలెన్స్, ట్రాఫిక్, విద్యుత్తు, శాంతి భద్రతల పోలీస్ విభాగాలను సమన్వయం చేసుకొని సమర్థ వంతమైన వ్యవస్థగా హైడ్రా ఉండాలని సూచించారు.
హైడ్రా విధి విధానాలపై ముఖ్యమంత్రి సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు సంబంధిత అధికారులతో చర్చించారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపు ఇందుకు సంబంధించి పూర్తి స్థాయి విధి విధానాలు రూపొందించాలని చెప్పారు.
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు 2 వేల చ. కి.మీ పరధిలో ఈ విభాగం విధులు నిర్వర్థించేలా ఉండాలని నిర్ధేశించారు. విపత్తుల నిర్వహణతో పాటుగా ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ, చెరువులు, నాలాల కబ్జాలకు అడ్డుకట్ట వేయటం, ఆక్రమణలను తొలిగించటం, అక్రమ నిర్మాణాలు, నిబంధనలను పాటించని ఫ్లెక్సీలు, హోర్డింగ్లు, ప్రకటనల తొలిగింపు, ట్రాఫిక్ నిర్వహణ, తాగునీరు, విద్యుత్తు సరఫరా వంటి అంశాల్లో ప్రజలకు సేవలు అందించే విధంగా హైడ్రాకు విధులు, బాధ్యతలు అప్పగించాలని సీఎం స్పష్టం చేశారు.