బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాంధీ జంప్
గులాబీ బాస్ కు బిగ్ షాక్
హైదరాబాద్ – రాష్ట్రంలో కేసీఆర్ స్థాపించిన బీఆర్ఎస్ ఖాళీ అయ్యేటట్టుగా ఉంది. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి శపథం చేసినట్టు త్వరలోనే గులాబీ జెండాను పాతి పెడతానని ప్రకటించారు. ఆయన అన్నట్టుగానే ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేశారు.
ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు జంప్ జిలానీలుగా మారారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చారు. వాటన్నింటిని తుంగలో తొక్కి గులాబీ బాస్ కు షాక్ ఇచ్చారు. హస్తం గూటికి చేరారు. నిన్న ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకుంటే శనివారం అంతా ఊహించినట్టుగానే హైదరాబాద్ కు చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సీఎం.
ఎమ్మెల్యే గాంధీతో పాటు శేరిలింగంపల్లి కార్పొరేటర్ నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాధ్ రెడ్డి, హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస్ కూడా హస్తం గూటికి చేరిన వారిలో ఉన్నారు.
రేపు మరికొందరు ఎమ్మెల్యేలు జంప్ అయ్యే ఆలోచనలో ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.