NEWSTELANGANA

విద్యా సంస్థ‌లు క‌ర్మాగారాలు కాకూడ‌దు

Share it with your family & friends

ఉపాధి నిచ్చేలా త‌యారు కావాలి

హైద‌రాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. విద్యా సంస్థలు పట్టాలు చేతిలో పెట్టి నిరుద్యోగులను తయారు చేసే కర్మాగారాలుగా కాకూడ‌ద‌ని అన్నారు. దీనిని త‌మ స‌ర్కార్ ఒప్పుకోదంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

నైపుణ్యం కలిగిన వారిగా తీర్చిదిద్దడంలో కాలేజీలు ప్రపంచ అవసరాలకు తగినట్టుగా సరికొత్త ప్రణాళికలు తయారు చేయాలని కోరారు. అందుకు తమ ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుందని స్ప‌ష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.

హైదరాబాద్‌ జేఎన్‌టీయూ ఆడిటోరియంలో శనివారం ‘తెలంగాణలో నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యాబోధన’ అంశంపై ఆయా కాలేజీల యాజమాన్యాలు, కాలేజీల ప్రిన్సిపల్స్, డీన్స్, హెచ్‌వోడీ తదితరులను ఉద్దేశించి సీఎం ప్రసంగించారు. నైపుణ్యతను పెంచాలన్న సంకల్పంతోనే స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటుకు శ్రీకారం చుట్టామ‌న్నారు.

ప్రపంచంతో పోటీపడే విధంగా తెలంగాణ యువతను తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని చెప్పారు., ఆ క్రమంలోనే ఇంజనీరింగ్ విద్యను మరింత పటిష్టం చేసి, ఉన్నత నాణ్యతా ప్రమాణాల స్థాయికి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రాథమిక స్థాయిలో 65 ఐటీఐ కాలేజీలను అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా అప్‌గ్రేడ్ చేస్తున్నామ‌ని వెల్ల‌డించారు.