DEVOTIONAL

దళారీల బెడద లేకుండా చర్యలు -⁠ ⁠టీటీడీ

Share it with your family & friends

శ్రీవారి భక్తులకు పారదర్శకంగా దర్శన,వసతి

తిరుమల – దేశ విదేశాల నుండి ప్రతిరోజు తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు టీటీడీ కల్పిస్తున్న దర్శనం, వసతి తదితర సేవలు దళారుల ప్రమేయం లేకుండా, మరింత పారదర్శకంగా అందించేందుకు టీటీడీ చర్యలు చేప‌ట్టింది.

ఇందులో భాగంగా టీటీడీ భక్తులకు ఆఫ్‌లైన్ (కౌంటర్ సేవలు) , ఆన్‌లైన్ (వెబ్ పోర్టల్) రెండింటిలోనూ అందించే సేవలను అనేక మంది మధ్యవర్తులు భక్తులను మోసం చేసి, భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారనేది గుర్తించింది.

గత ఏడాది కాలంగా ఆన్‌లైన్ లో (రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం, డిప్, వసతి, ఆర్జిత సేవాలు, వర్చువల్ సేవలు మొదలైనవి), ఆఫ్‌లైన్ లో (ఎస్ ఎస్ డి టోకెన్లు, వసతి) తదితర సేవల బుకింగ్‌లపై ఇటీవల టీటీడీ విచారణ జరిపింది.

ఇందులో ఓకే మొబైల్ నంబర్, మెయిల్ ఐడీలు ఉపయోగించి మధ్యవర్తులు బల్క్ బుకింగ్ పొందినట్లు విచారణలో తేలింది. ఈ ఏడాది తిరుమలలో కరెంట్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌తో 110 గదులు, 124 బుకింగ్స్ సంబంధించి 12కు పైగా గదులు పొందినట్లు అధికారుల విచారణలో నిర్ధారణ అయింది.

అదేవిధంగా ఆన్‌లైన్ బుకింగ్‌లో ఒకే మొబైల్ నంబర్‌ను ఉపయోగించి 807 వసతి బుకింగ్‌లు, ఆన్‌లైన్ ఒకే ఇమెయిల్ ఐడిని ఉపయోగించి 926 వసతి బుకింగ్‌లు, ఒకే మొబైల్ నంబర్‌ని ఉపయోగించి ఒక సంవత్సరంలో 1,279 డిప్ రిజిస్ట్రేషన్‌లు, ఒకే మెయిల్ ఐడిని ఉపయోగించి ఒక సంవత్సరంలో 48 డిప్ రిజిస్ట్రేషన్‌లు, ఒకే ఐడి ప్రూఫ్‌ని ఉపయోగించి 14 ఎస్ ఎస్ డి సర్వ సర్వదర్శనం టోకెన్‌లు పొందిన‌ట్లు స్ప‌ష్టంగా తేలింది.

భక్తులకు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, టీటీడీ అందిస్తున్న సేవలలో పారదర్శకతను మరింతగా పెంచేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ సేవలను మరింత మెరుగు పరిచి ఆఫ్‌లైన్‌లో , ఆన్‌లైన్‌లో టికెట్లు పొందే దళారులు, మధ్యవర్తులపై టీటీడీ చర్యలు చేపట్టింది.

ఇందులో బల్క్ బుకింగ్‌లకు ఉపయోగించే మొబైల్ నంబర్‌లు, మెయిల్‌లు , ఐడి ప్రూఫ్‌లు రద్దు చేశారు. ఫేక్ మొబైల్ నెంబర్లు, మెయిల్ ఐడిలు, ఐడి ప్రూఫ్ లు ఉపయోగించి ఇప్పటికే బుక్ చేసిన సేవలను ఉపయోగించడానికి అనుమతించబడవు. బుకింగ్ రద్దు అయినట్లు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు తెలియజేయబడుతుంది.

నిజమైన యాత్రికులు ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్‌ను ఉపయోగించి మధ్యవర్తి లేకుండా సేవను నేరుగా పొందేలా టీటీడీ కార్యాచరణ రూపొందిస్తోంది. దళారులు ఫేక్ మొబైల్, మెయిల్ , ఐడి ప్రూఫ్‌లను ఉపయోగించి చేసిన బుకింగ్‌లపై కఠినమైన ఆంక్షలు విధించారు. సరైన ధృవీకరణ కోసం ఆధార్ సేవలను ఉపయోగించేలా కూడా టీటీడీ ప్రయత్నాలు చేపడుతోంది.