నిరుద్యోగుల జోలికి వస్తే ఊరుకోం – తన్నీరు
సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు వార్నింగ్
హైదరాబాద్ – మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. తమ న్యాయ పరమైన డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కిన నిరుద్యోగుల బాధలను ఒకసారి వినాలని సూచించారు. ఆదివారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా తన్నీరు హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. శాంతియుతంగా పోరాడుతున్న వారి పట్ల దయతో ఉండాలే తప్పా దారుణంగా ప్రవర్తించ కూడదని హితవు పలికారు.
ఇది ప్రభుత్వానికి మంచిది కాదని పేర్కొన్నారు తన్నీరు హరీశ్ రావు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల మొర ఆలకించాలని రేవంత్ రెడ్డి ని కోరారు. భేషజాలకు పోకుండా, వారి జీవితాలను, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సమస్యకు ఓ పరిష్కారం చూపాలని కోరారు.
గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు తన్నీరు హరీశ్ రావు. వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలే తప్పా వారిని రెచ్చగొట్టే విధంగా, కించ పరిచే విధంగా మాట్లాడి అబాసుపాలు కావద్దన్నారు.
పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం ఫలించక పొగా, అది మరింత ఉదృతం అవుతుందని హెచ్చరించారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేసినా, వారిపై భౌతిక దాడులకు పాల్పడినా తాము చూస్తూ ఊరుకోబోమని ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు.