కదం తొక్కిన నిరుద్యోగులు
కాంగ్రెస్ సర్కార్ పై కన్నెర్ర
హైదరాబాద్ – తమ న్యాయ పరమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరుద్యోగులు చేపట్టిన ఆందోళన ఉధృతంగా మారింది. భారీ ఎత్తున నిరుద్యోగులు తరలి వచ్చారు. కాంగ్రెస్ సర్కార్ అనుసరిస్తున్న తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు దాడులు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇందు కోసమేనా తాము ఓట్లు వేసిందంటూ మండిపడ్డారు. అర్ధరాత్రి దాకా ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సుప్రీంకోర్టు ఆదేశాలను పక్కన పెట్టి యూనివర్శిటీలోకి పోలీసులు ఎలా వస్తారంటూ ప్రశ్నించారు.
నిరుద్యోగులు తలుచుకుంటే సర్కార్ ఉండదంటూ హెచ్చరించారు. తాము పరీక్షలను రద్దు చేయాలని కోరడం లేదని, కొంత వ్యవధి ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామని, ఇది తప్పు ఎలా అవుతుందంటూ సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు.
ఇప్పటి వరకు ఏ ఒక్కరు తమను పరామర్శించిన పాపాన పోలేదని, కనీసం చర్చలకు పిలిచేందుకు కూడా సమయం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు నిరుద్యోగులు. ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ చెప్పిన మొహబ్బత్ కీ దుకాన్ అంటే ఇదేనా అని ఎద్దేవా చేశారు. రాబోయే రోజుల్లో తమతో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇకనైనా సర్కార్ తన తీరు మార్చు కోవాలని సూచించారు.