తృటిలో తప్పించుకున్న ట్రంప్
మాజీ ప్రెసిడెంట్ పై బుల్లెట్ల వర్షం
అమెరికా – యుఎస్ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పై హత్యాయత్నం చోటు చేసుకుంది. ఆయన బుల్లెట్ల దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ప్రస్తుతం ట్రంప్ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం.
అమెరికా అంతటా ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. త్వరలో ఎన్నికలు జరగనుండడంతో ఈ దాడి ట్రంప్ కు మైలేజ్ ఇవ్వనుందని టాక్. మాజీ ప్రెసిడెంట్ ట్రంప్ పెన్సిల్వేనియాలో ప్రచార ర్యాలీ లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన ప్రసంగిస్తుండగా తుపాకి శబ్దం వినిపించింది. దీంతో సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఒక్కసారిగా అప్రమత్తం అయ్యారు.
ట్రంప్ పై కాల్పులు జరగడంతో ఆయన చెవి నుంచి రక్తం కారడం కనిపించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆయన సేఫ్ గానే ఉన్నారంటూ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ తెలిపారు.
దాడి జరిగిన వెంటనే హుటా హుటిన భారీ భద్రత మధ్య బయటకు తరలించామని స్పష్టం చేశారు. చాలా మంది ర్యాలీ సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో అనుమానాస్పదంగా ఉండడాన్ని గమనించామని పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా మిల్వాకీలో సోమవారం ప్రారంభమయ్యే రిపబ్లికన్ పార్టీ సమావేశానికి ముందు ట్రంప్ తన చివరి ప్రచార ర్యాలీలో వేదికపైకి వచ్చిన కొద్దిసేపటికే ఈ గందరగోళం చోటుచేసుకుంది.