సీఎం రేవంత్ యువతకు క్షమాపణ చెప్పాలి
డిమాండ్ చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
హైదరాబాద్ – మాజీ మంత్రి కేటీఆర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ అమలు చేయక పోవడం దారుణమన్నారు.
నిరుద్యోగులు, విద్యార్థులపై సీఎం చేసిన కామెంట్స్ పై మండిపడ్డారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాగేనా మాట్లాడేది అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్. నిర్లక్ష్యంగా, నిర్లజ్జగా ముఖ్యమంత్రి తన స్థాయి దిగజారి, అత్యంత దివాళకోరు తనంతో మాట్లాడడం బాధాకరమని పేర్కొన్నారు.
పోరాటం చేస్తున్న మోతీలాల్ నాయక్ ను అవమానించడం దారుణమన్నారు కేటీఆర్. నిరుద్యోగుల ఆగ్రహానికి గురి కావద్దని హెచ్చరించారు. వారు ఎవరి మద్దతు లేకుండానే తమ న్యాయ పరమైన డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నారని అన్నారు. వారికి రాజకీయాలు ఆపాదించడం మంచి పద్దతి కాదన్నారు కేటీఆర్.
రాష్ట్రంలో కొలువు తీరి 7 నెలలు పూర్తయిందని ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఇక రాబోయే రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఎలా భర్తీ చేస్తారో చెప్పాలన్నారు. మాటలు తప్ప ఆచరణలో సాధ్యం కావడం లేదన్నారు. ఇకనైనా ఆచరణకు నోచుకోని హామీలు ఇవ్వకుండా ఉంటే మంచిదని సీఎంకు సలహా ఇచ్చారు కేటీఆర్.
రేవంత్ రెడ్డి ఈగోకి, భేషజాలకు పోకుండా తగు నిర్ణయం తీసుకోవాలని కోరారు. నిరుద్యోగులను రెచ్చ గొట్టింది సీఎం, రాహుల్ గాంధీ అంటూ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్ష నేతగా మాట్లాడుతున్నాడే తప్పా సీఎంగా మాట్లాడటం లేదని మండిపడ్డారు.