మేక బతుకు లాంటి పుస్తకాలు మరిన్ని రావాలి
పిలుపునిచ్చిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – రచయిత్రి స్వర్ణ కిలారి రాసిన మేక బతుకు పుస్తకాన్ని ఆవిష్కరించారు మాజీ మంత్రి కేటీఆర్. ఆదివారం బంజారా హిల్స్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ఏర్పాటు చేసిన పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
మేక బతుకు లాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు. తాను స్వయంగా దుబాయ్ వెళ్లానని, అక్కడ లేబర్ క్యాంపులలో ఉన్న కార్మికుల కష్టాలను కళ్లారా చూశానని తెలిపారు. గల్ఫ్ కార్మికుల కష్టాలు విన్నా, చూసినా గుండె మండుతుందన్నారు కేటీఆర్.
గతంలో తాము గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకంగా పాలసీ తీసుకు రావాలని ప్రయత్నం చేశామని చెప్పారు. టామ్ కామ్ సంస్థ ద్వారా కొంత మేరకు కృషి చేశామన్నారు కేటీఆర్. వలస ఎంత వాస్తవమో అంతకు మించి వలసలోని దోపిడీ కూడా అంతే నిజమన్నారు. అది దుబాయ్ అయినా లేదా హైదరాబాద్ అయినా లేక ఇంకోటి ఏ ప్రాంతమైనా ఇలాగే ఉంటుందన్నారు.
ఒకనాడు దేశంలో ఎక్కడ నిర్మాణం జరిగినా పాలమూరు జిల్లా నుంచి వలసలు ఉండేవన్నారు. కానీ ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు వలస రావడం ప్రారంభమైందన్నారు. అయితే ప్రస్తుతం చదివే అలవాటు రాను రాను తగ్గిపోతోందన్నారు. ఇలాంటి మేక బతుకు లాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందన్నారు కేటీఆర్.