మేం వద్దన్నా ఎమ్మెల్యేలు క్యూ కట్టారు
ఎద్దేవా చేసిన సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. తమపై అవాకులు చెవాకులు పేలుతున్న బీఆర్ఎస్ నేతలను ఏకి పారేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
బీఆర్ఎస్, భారతీయ జనతా పార్టీ నేతలు పదే పదే తమ సర్కార్ ను పడగొడతామంటూ ప్రగల్భాలు పలికారని, అంతే కాకుండా కేవలం మూడు నెలలు మాత్రమే ఉంటుందని సవాల్ విసిరారని గుర్తు చేశారు సీఎం రేవంత్ రెడ్డి.
అంతే కాదు మా పని అయి పోయిందంటూ ఎద్దేవా చేశారని, కానీ ఇలా తమను అన్న వాళ్లు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదని, భూతద్దంతో తాను చూస్తున్నా కనిపించడం లేదంటూ మండిపడ్డారు. విచిత్రం ఏమిటంటే తాము ఏనాడూ ఎవరినీ , ఏ ఎమ్మెల్యేలను చేరాలని కోరలేదని చెప్పారు సీఎం.
వారంతకు వారే తమ పార్టీలో చేరుతామంటూ క్యూ కడుతున్నారని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి. మీరు పడగొట్టాలని చూస్తే తాము నిలబెడేలా చేస్తామంటూ ముందుకు వస్తున్నారని, వారిని అందుకే చేర్చుకోక తప్పడం లేదన్నారు సీఎం. అంతే కాదు మా ఆలోచనా విధానం, చేస్తున్న అభివృద్ది, నిర్వహిస్తున్న ప్రజా రంజక పాలనను చూసి వస్తుంటే మీకెందుకు బాధ అంటూ మండిపడ్డారు .