DEVOTIONAL

రాష్ట్ర ప్ర‌జ‌లు బాగుండాలి – డీజీపీ

Share it with your family & friends

కాణిపాక వినాయ‌కుడి ద‌ర్శ‌నం

చిత్తూరు జిల్లా – రాష్ట్ర ప్ర‌జ‌లు సుఖ సంతోషాల‌తో ఉండాల‌ని తాను వ‌ర‌సిద్ది వినాయ‌కుడిని కోరుకున్నాన‌ని చెప్పారు ఏపీ డీజీపీ ద్వారకా తిరుమ‌ల రావు. ఆదివారం ఆయ‌న కాణిపాకం ఆల‌యాన్ని సంద‌ర్శించారు. పూజ‌లు చేశారు. అనంత‌రం డీజీపీ మీడియాతో మాట్లాడారు.

రాష్ట్రం లో ఎలాంటి ఆటంకాలు, శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా విజ్ఞాలు తొలగి పోవాలని కాణిపాకం వినాయక స్వామి వారిని ప్రార్థించాన‌ని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరికీ శాంతి భద్రతలు క‌ల్పించ‌డంపై ఫోక‌స్ పెడ‌తాన‌ని చెప్పారు.

ఈ నేపథ్యంలో పోలీసు శాఖను మరింత సమర్థవంతంగా మార్చడానికి పలు కీలక చర్యలు తీసుకుంటున్నామ‌ని స్ప‌ష్టం చేశారు ఏపీ డీజీపీ. నేర పరిశోధనలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెంచుతూ, పోలీసు శాఖలో ఆధునిక సదుపాయాలు కల్పించడం జరుగుతోందన్నారు. ఈ క్రమంలో, సీసీ కెమెరాలు, డ్రోన్లు, డిజిటల్ ఫోరెన్సిక్ టూల్స్ వంటివి విస్తృతంగా ఉపయోగిస్తామ‌న్నారు ద్వార‌కా తిరుమ‌ల రావు.

రాష్ట్రంలో పిల్లలు, మహిళల భద్రతను మరింత పటిష్టం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఇందులో బాగంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ లను రాష్ట్రమంతటా ఏర్పాటు చేస్తామ‌ని చెప్పారు ఏపీ డీజీపీ.

రహదారి ప్రమాదాలను తగ్గించడానికి, రహదారి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతోందన్నారు. రోడ్లపై సీసీ కెమెరాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేసి, రోడ్డు నియమాలను కచ్చితంగా అమలు చేస్తామ‌న్నారు.

ఎర్ర చందనం స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామ‌న్నారు. ఈ క్రమంలో, ప్రత్యేక టాస్క్ ఫోర్స్‌ ద్వారా స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతామ‌ని హెచ్చ‌రించారు.