శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సీఎస్
వేద పండితుల ఆశీర్వాదం
తిరుమల – ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ప్రముఖ పుణ్య క్షేత్రం తిరుమలను సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు సాదర స్వాగతం పలికారు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి (టీటీడీ) అదనపు కార్య నిర్వహణ అధికారి వీర బ్రహ్మం .
సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ తో పాటు ఆయన భార్య కూడా శ్రీ వేంకటేశ్వర స్వామి, శ్రీ అలివేలు మంగమ్మలను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ ప్రధాన పూజారులు ఆశీర్వచనం అందజేశారు.
స్వామి వారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, డైరీ, క్యాలెండర్‌ను జేఈవో వీరబ్రహ్మం అందజేశారు. ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.
ప్రపంచంలోనే అత్యధిక మంది భక్తులను కలిగిన ఏకైక పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతోంది తిరుమల పుణ్య క్షేత్రం. ప్రతి రోజూ 70 వేల మందికి పైగా భక్తులు స్వామి, అమ్మ వార్లను దర్శించుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో జేఈఓ గౌతమి, డెప్యూటీ ఈవోలు లోకనాథం, హరీంధ్ర నాథ్ తదితరులు పాల్గొన్నారు.