న్యాయం కోసం ప్రశ్నిస్తాం..మద్దతిస్తాం
స్పష్టం చేసిన అనుగుల రాకేష్ రెడ్డి
హైదరాబాద్ – బీఆర్ఎస్ సీనియర్ నేత అనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఆవేదన చెందారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఉన్న వ్యవస్థలను నిర్వీర్యం చేయడం తప్ప చేసింది ఏముందని ప్రశ్నించారు.
న్యాయం కోసం జరిగే ఏ ఆందోళనకైనా లేదా ఏ పోరాటానికైనా తాము బరా బర్ మద్దతు ఇచ్చి తీరుతామని స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఆందోళన వెనుక బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారంటూ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఆరోపించడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది మీరు కాదా అని నిలదీశారు. పనిగట్టుకుని పాలన చేతకాక తమపై విమర్శలు చేస్తే ఎలా అంటూ ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు పరీక్షలను రద్దు చేయమని అడగలేదని, కేవలం కొంత సమయం ఇచ్చి నిర్వహించమని కోరారని తెలిపారు. వారిపై కూడా ఒక బాధ్యత కలిగిన సీఎం బాధ్యతా రాహిత్యంతో కామెంట్ చేయడం దారుణమన్నారు అనుగుల రాకేష్ రెడ్డి. ఇకనైనా ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టు కోవాలని కోరారు.