ఉక్కు ఉత్పత్తిపై కేంద్రం ఫోకస్
ఎగుమతులను పెంచాలన్న మంత్రి
న్యూఢిల్లీ – కేంద్ర కేబినెట్ లో కీలకమైన పదవిని చేపట్టిన కర్ణాటక మాజీ సీఎం , ప్రస్తుత కేంద్ర ఉక్కు , గనుల శాఖ మంత్రి హెచ్ డి కుమార స్వామి దూకుడు పెంచారు. ఆయన దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఎక్కడెక్కడ ఉక్కు ఉత్పత్తికి సంబంధించి వనరులు ఉన్నాయనే దానిపై దృష్టి సారించారు.
బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన శాఖకు సంబంధించి సమీక్షలతో హోరెత్తించారు. అంతే కాకుండా హైదరాబాద్ లోని ప్రధాన కార్యాలయం నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ను సందర్శించారు. అక్కడ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రయత్నం చేయాలని, ఆ నమ్మకం తనకు ఉందని స్పష్టం చేశారు.
ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తల మానికంగా నిలిచిన విశాఖ ఉక్కు సంస్థను సందర్శించారు హెచ్ డి కుమార స్వామి. ఈ సందర్బంగా సదరు సంస్థను ప్రైవేటీకరణ చేసే ప్రసక్తి లేదని ప్రకటించారు. దీనిపై ఆధారపడి వేలాది కుటుంబాలు పని చేస్తున్నాయని, జరుగుతున్న దుష్ప్రచారాన్ని నమ్మ వద్దని కోరారు కేంద్ర మంత్రి.
ఇదిలా ఉండగా సోమవారం ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ డైరెక్టర్, సీఈఓ దిలీప్ ఊమెన్‌తో సమావేశం అయ్యారు కుమార స్వామి. ఈ సందర్బంగా ఉక్కు ఉత్పత్తి, ఎగుమతుల కోసం రోడ్ మ్యాప్ గురించి చర్చించారు.