డ్రగ్స్ కేసులో రకుల్ సోదరుడు అరెస్ట్
ఇప్పటికే హీరోయిన్ పై పలు ఆరోపణలు
హైదరాబాద్ – తీగ లాగితే డొంకంతా కదిలినట్టు డ్రగ్స్ వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. సందీప్ శాండిల్యా బాధ్యతలు స్వీకరించడంతో ఈ మధ్యన భారీ ఎత్తున దాడులు ముమ్మరం చేశారు. సోమవారం ఊహించని విధంగా ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ సింగ్ డ్రగ్స్ కేసులో పట్టుపడ్డాడు. దీంతో ఒక్కసారిగా టాలీవుడ్ లో కలకలం రేపింది.
సైబరాబాద్ పోలీస్ పరిధిలోని నార్కో టిక్స్ బ్యూరో, రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. డ్రగ్స్ కేసుకు సంబంధించి అమన్ ప్రీత్ సింగ్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో కీలక అంశాలు బయట పడ్డాయి.
డ్రగ్స్ వినియోగదారులు 30 మంది ఉన్నారని సందీప్ శాండిల్య వెల్లడించారు. గుర్తించిన ముప్పై మందిలో టాలీవుడ్ కు చెందిన ఓ నటుడి సోదరుడు కూడా ఉన్నారని ప్రకటించారు. ఒక మహిళా నేతృత్వంలోని ముఠా 2.6 కిలోల కొకైన్ ను నగరానికి తీసుకు వచ్చిందని చెప్పారు.
నార్కో టీమ్ ఆమె కదలికలపై నిఘా ఉంచిందన్నారు. సదరు మహిళ ఎక్కువగా హైదరాబాద్ – బెంగళూరు, హైదరాబాద్ – ఢిల్లీ మార్గాల ద్వారా విమానాలు, రైళ్లలో ప్రయాణః చేసిందన్నారు. హైదరాబాద్ కు వచ్చినప్పుడు 200 నుంచి 300 గ్రాములు విక్రయించిందని చెప్పారు శాండిల్య.