కుల గణనపై దృష్టి పెట్టండి – సీఎం
బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఆరా
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని ఖాళీ చేయించే పనిలో పడ్డారు. పలువురు ఎమ్మెల్యేలు , ఇతర ప్రజా ప్రతినిధులు క్యూ కట్టారు. ఇదే సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఇటీవల పెద్ద ఎత్తున బీసీలకు అన్యాయం జరుగుతోందన్న భావన నెలకొంది. దీనిని తొలగించేందుకు గాను ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీ మేరకు కుల గణన చేపట్టాలని నిర్ణయించారు. ఈ మేరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లు పెంచడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపు, ఇతర అంశాలపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షించారు. రాష్ట్రంలో కుల గణన నిర్వహించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నందున ఆ నివేదిక ఆధారంగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లడానికి ఎంత సమయం పడుతుందన్న వివరాలను అధికారులను అడిగారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు ఆగి పోకుండా సాధ్యమైనంత తొందరగా ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి తెలంగాణలో జరిగిన పంచాయతీ ఎన్నికల వరకు అనుసరించిన విధానాలు, వివిధ రాష్ట్రాల స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో దాఖలైన కేసులు, వాటి తీర్పులు, పర్యవసనాలను మాజీ మంత్రి జానారెడ్డి వివరించారు.