ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం..నిలదీస్తాం
మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి
నెల్లూరు జిల్లా – తాము ఓడి పోయినా ప్రజల పక్షమే వహిస్తామని స్పష్టం చేశారు మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి. జనం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తామని, వారికి అన్ని వేళలా అండగా ఉంటామని అన్నారు. ఎవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. రాష్ట్రంలో తాజాగా జరిగిన శాసన సభ, సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 40 శాతానికి పైగా ప్రజలు ఓట్లు వేశారని, ఆ విషయం వైసీపీ నేతలు, కార్యకర్తలు , శ్రేణులు మరిచి పోవద్దని అన్నారు.
సర్వేపల్లి నియోజకవర్గం తోటపల్లి గూడూరు మండలంలోని రిషి కళ్యాణ మండపంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు కాకాణి గోవర్దన్ రెడ్డి. ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు.
దేశంలోనే ఎక్కడా లేనటువంటి పరిపాలన సంస్కరణలు, పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత మాజీ సీఎందేనని పేర్కొన్నారు. నేడు అధికారం లేకున్నా, ప్రజలకు అండగా నిలవాలని జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారని చెప్పారు కాకాణి గోవర్దన్ రెడ్డి. నెలరోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వ పోకడలు చూస్తే, ప్రజలను మోసం చేసే విధంగా ఉందన్నారు.