ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
ఉచిత బస్సు స్కీం..ల్యాండ్ యాక్ట్ రద్దు
అమరావతి – ఏపీ రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. మంగళవారం సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో కీలక సమవేశం జరిగింది. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించి కీలక అంశాలపై చర్చ జరిగింది.
ప్రధానంగా ప్రజలకు ఇబ్బందిగా మారిన గత ప్రభుత్వం తీసుకు వచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంతే కాకుండా కొత్త ఇసుక విధానానికి ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగా కొత్త ఇసుక పాలసీపై త్వరలో విధి విధానాలు రూపొందించాలని స్పష్టం చేసింది..
పౌరసరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఆమోదం తెలిపింది మంత్రివర్గం. ఇందుకు గాను ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చేందుకు ఓకే చెప్పింది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు ఎన్‌సీడీసీ నుంచి రూ.3200 కోట్ల రుణానికి ఆమోదం తెలిపింది మంత్రివర్గం.
రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారెంటీకి ఓకే చెప్పింది. ఇదిలా ఉండగా జూలై 22 నుంచి అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.