సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం
స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్
తాడేపల్లి గూడెం – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం , జనసేన పార్టీల కూటమి సుస్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్. టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు పవన్ ను తమ ఇంటికి ఆహ్వానించారు. ఈ మేరకు వీరిద్దరి మధ్య గంటకు పైగా చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో నారా లోకేష్ తో పాటు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు.
రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల గురించి చర్చించారు. ఈసారి ఎలాగైనా సరే వైసీపీని అధికారం నుంచి గద్దె దించాలని పిలుపునిచ్చారు. ప్రజలు జగన్ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని కోరుకుంటున్నారని అన్నారు.
ప్రభుత్వం వచ్చాక అమరావతిని బంగారు రాజధాని చేసుకుంటామన్నారు పవన్ కళ్యాణ్. చంద్రబాబుతో భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జై అమరావతి జై ఆంధ్రా అనే ఉమ్మడి నినాదంతో ముందుకు వెళతామని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
నిరుద్యోగం పెరిగి పోయింది. యువత తీవ్ర నిరాశ నిస్పృహలో కొట్టు మిట్టాడుతున్నారని వారికి తాము పూర్తి భరోసా ఇస్తున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్.