ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ వర్తింపు
స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య శ్రీ కార్డుతో సంబంధం లేకుండా ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింప చేయాలని స్పష్టం చేశారు. ఆరు గ్యారంటీలను రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయాలనేది ప్రభుత్వ ధ్యేయమని సీఎం పునరుద్ఘాటించారు. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డులతో సంబంధం లేకుండా అందరికీ ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చూడటమే కాకుండా ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ రూపొందించాలని ఆదేశించారు.
గృహ జ్యోతి, మహాలక్ష్మి గ్యాస్ సిలిండర్ పథకాలకు అర్హులై ఉండీ పథకం వర్తించక పోతే.. తమ ఆధార్, రేషన్ కార్డు, లేదా గ్యాస్ కనెక్షన్ నెంబర్, విద్యుత్తు సర్వీసు నెంబర్లు సరి చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం. పెండింగ్ లో ఉన్న ధరణి సమస్యలను వీలైనంత తొందరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఆగస్టు 15 లోగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిష్కరించాలని సూచించారు.
మహిళా స్వయం సహాయక సంఘాల్లో 64 లక్షల మంది సభ్యులుండగా, కోటి మంది సభ్యులుగా చేరేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఆర్టీసీలో కొత్తగా అవసరమయ్యే అద్దె బస్సులు కూడా మహిళా సంఘాలకు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని అన్నారు సీఎం. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలు అన్యాక్రాంతం కాకుండా కాపాడటానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.