సుప్రీం తీర్పు సర్కార్ కు చెంప పెట్టు
సీజేఐ డీవై చంద్రచూడ్ కు ధన్యవాదాలు
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఇచ్చిన తీర్పు తెలంగాణ సర్కార్ అనుసరిస్తున్న ఏకపక్ష , కక్ష సాధింపు చర్యలకు చెంప పెట్టు లాంటిదని పేర్కొన్నారు. బుధవారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు కేటీఆర్.
పనిగట్టుకుని తమ పార్టీ చీఫ్ , మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడం మంచి పద్దతి కాదని తాము ముందు నుంచి చెబుతూనే వస్తున్నామని , అయినా సీఎం రేవంత్ రెడ్డి వినిపించు కోలేదని వాపోయారు.
రాష్ట్ర ప్రజలకు నిరంతరం 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేయడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. విద్యుత్ కమిషన్ చైర్మన్ రిటైర్డ్ జడ్జి ఎల్ . నరసింహా రెడ్డి పరిధి దాటి వ్యక్తిగత ఆరోపణలు చేయడం పట్ల తమ నాయకుడు సుదీర్ఘ లేఖ రాశారని వెల్లడించారు.
చైర్మన్ కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని తెలిపారు. ఈ మేరకు సీజేఐ చేసిన వ్యాఖ్యలు , ఇచ్చిన తీర్పు సంచలనంగా మారిందని అన్నారు కేటీఆర్.
ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని, ధర్మమే నిలుస్తుందని ఈ తీర్పుతో తేలి పోయిందని, ఇకనైనా సీఎం మారితే బావుంటుందని హితవు పలికారు.