NEWSANDHRA PRADESH

ఫీజు రీ ఎంబర్స్ మెంట్ పై దృష్టి పెట్టాలి

Share it with your family & friends

విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సమీక్ష

అమరావతి : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో విద్యను అభ్య‌సించే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు.

రాష్ట్రంలో ఉన్నత విద్యా శాఖ‌ పరిధిలో నెలకొన్న సమస్యలపై మంత్రి లోకేష్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడారు. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి గత ప్రభుత్వం రూ. 3,480 కోట్లు బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికెట్లు ఆయా విద్యా సంస్థల్లో నిలచి పోయాయని అన్నారు.

ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా తయారైందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల్లో డ్రగ్స్ ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా మంత్రి ఆదేశించారు.

ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ల నియామకం అంశాన్ని పరిశీలించాలని అన్నారు. అదే విధంగా డ్రగ్స్ పై విద్యార్థులను చైతన్యం చేసేందుకు స్వచ్చంద సంస్థల సహకారాన్ని తీసుకోవాలని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 3220 లెక్చరర్ పోస్టుల భర్తీకి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చించారు.

న్యాయ పరమైన చిక్కులను తొలగించి సాధ్యమైనంత త్వరగా పోస్టులను భర్తీ చేసేందుకు కసరత్తు చేపట్టాలని అన్నారు. రాజకీయ ప్రమేయం లేకుండా పూర్తి పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా పోస్టుల భర్తీ ప్రక్రియ ఉండాలని స్పష్టం చేశారు.

యూనివర్సిటీలకు సంబంధించి అకడమిక్, ఎగ్జామినేషన్ షెడ్యూలు, క్యాలండర్ తయారు చేసి, నిర్ణీత సమయంలో పరీక్షలు నిర్వహణ, ఫలితాల ప్రకటనకు చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో గత అయిదేళ్లుగా ప్రవేశాలు తగ్గి పోవడంపై మంత్రి ఆందోళన వ్యక్తంచేశారు.

ఈ విషయమై సీరియస్ గా దృష్టిసారించి, అడ్మిషన్ల పెంపుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉన్నత విద్యా సంస్థల వివరాలు, మౌలిక సదుపాయాలు, అడ్మిషన్లు, కోర్టు కేసుల వివరాలు తదితర అంశాలన్నింటినీ డ్యాష్ బోర్డులో పొందుపర్చాలని అన్నారు.

ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ, ఫీజులు ఏమేరకు ఉండాలి, రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల పనితీరు, అప్రెంటీస్ షిప్ ఎంబెడెడ్ డిగ్రీ ప్రోగ్రామ్ కు కళాశాలల ఎంపిక, రాష్ట్రంలో శ్రీ పొట్టి శ్రీరాములు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల ఏర్పాటు చేసే అంశాలపై సమావేశంలో సమీక్షించారు.