ఆణివార ఆస్థానం పర్వదినం
టీటీడీ ఈవో జె. శ్యామల రావు
తిరుమల – శ్రీవారి ఆలయంలో ఘణంగా ఆణివార ఆస్థానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో జె. శ్యామల రావు మాట్లాడారు. సాధారణంగా ప్రతి సంవత్సరం సౌర మానం ప్రకారం దక్షిణాయన పుణ్య కాలంలో కర్కాటక సంక్రాంతి నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారని చెప్పారు.
అయితే సౌర మానాన్ని అనుసరించే తమిళుల కాలమానం ప్రకారం ఆణిమాసం చివరి రోజున నిర్వహించే కొలువు కావడంతో ఆణివార ఆస్థానం అని పేరు వచ్చిందన్నారు. పూర్వం మహంతులు దేవస్థాన పరిపాలనను స్వీకరించిన రోజు అయిన ఈ ఆణివార ఆస్థానం పర్వ దినం నాటి నుండి టీటీడీ వారి ఆదాయ వ్యయాలు, నిల్వలు తదితర వార్షిక లెక్కలు ప్రారంభమయ్యేవని తెలిపారు.
టీటీడీ ధర్మకర్తల మండలి ఏర్పడిన తరువాత వార్షిక బడ్జెట్ను మార్చి – ఏప్రిల్ నెలలకు మార్చినట్టు వివరించారు. పుష్ప పల్లకీపై స్వామి, అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దర్శనం ఇచ్చారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జేఈఓలు గౌతమి, వీరబ్రహ్మం, సివి అండ్ ఎస్ఓ నరసింహ కిషోర్, ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులు, గోవిందరాజ దీక్షితులు, ముఖ్య అర్చకులు కిరణ్ స్వామి, ఎస్ఇ-2 జగదీశ్వర్ రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, అదనపు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సునీల్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.