ఆర్టీవీపై యూరో ఎక్సిమ్ బ్యాంకు దావా
రూ.100 కోట్ల పరువు నష్టం చెల్లించాలని
హైదరాబాద్ – ప్రముఖ జర్నలిస్ట్ రవిప్రకాశ్ సారథ్యంలో నిర్వహిస్తున్న ఆర్టీవీకి బిగ్ షాక్ తగిలింది. యూరో ఎక్సిమ్ బ్యాంకు ఏకంగా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా దాఖలు చేసింది. తన క్లయింటు పై తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు గాను ఆర్ టీవీ ఎడిటర్ అండ్ పబ్లిషర్ వెలిచేటి రవిప్రకాష్ కు లండన్ కు చెందిన యూరో ఎక్సిమ్ బ్యాంకు లీగల్ నోటీసులు జారీ చేసింది.
పలు నిర్మాణ పనులను టెండర్లు లో భాగంగా దక్కించుకున్న తన క్లయింటు మేఘా ఇంజనీరింగ్ సంస్థ తరపున ప్రభుత్వానికి ఇచ్చిన బ్యాంకు గ్యారంటీ ని తప్పు పడుతూ ఆర్ టీవీ లో రవిప్రకాష్ తానె స్వయంగా కధనాలు ప్రసారం చేశారు.
అవి దొంగ బ్యాంకు గ్యారంటీలు అంటూ తప్పుడు కథనాలు ప్రసారం చేసినందుకు గాను రవిప్రకాష్ కు యూరో ఎక్సిమ్ బ్యాంకు తరపున లీగల్ ఏజెన్సీ నోటీసులు జారీ చేసింది.
ఈ కథనాల వల్ల కంపెనీకి ఆర్ధికంగా నష్టం వాటిల్లిందని, పరువు ప్రతిష్టలు కూడా భంగపడ్డాయని ఆ నోటీసులో ఆందోళన వ్యక్తం చేసింది. యాజమాన్యం ఉద్యోగుల మానసిక స్థయిర్యం దెబ్బతింది అని ఆవేదన వ్యక్తం చేసింది.
తమ బ్యాంకు లండన్ కేంద్రంగా ప్రపంచ వ్యాపితంగా కార్యక్రమాలు నిర్వహిస్తోందని, అందులో భాగంగా ఇండియాలో పలు ఇన్ఫ్రా కంపెనీలకు బ్యాంకు గ్యారంటీలను చట్ట బద్ధంగా ఇస్తోందని పేర్కొంది.
యూరో ఎక్సిమ్ బ్యాంకు వార్షిక వ్యాపారం 8 కోట్లు మాత్రమేనని ఆ కధనంలో పేర్కొనటాన్ని ఏజెన్సీ తప్పు పట్టింది. కనీసం 1900 కోట్ల టర్నోవరును ఈ ఎక్సిమ్ బ్యాంకు కలిగి ఉండగా, తప్పుడు వార్తలు ప్రసారం చేసినందుకు గాను వెంటనే క్షమాపణ చెప్పి ఆ లింకులను తొలగించక పొతే కోర్టులో పరువు నష్టం దావా 100 కోట్లకు వేస్తామని, సివిల్ క్రిమినల్ చర్యలు తీసుకుంటామని బ్యాంకు తరపున చెన్నై కు చెందిన అడ్వకేట్ BSV ప్రకాష్ కుమార్ ఆర్ టీవీ రవి ప్రకాష్ కు నోటీసిలు పంపించారు.