జగన్ హింస గురించి మాట్లాడితే ఎలా..?
నిప్పులు చెరిగిన మంత్రి నారా లోకేష్
అమరావతి – ఏపీ విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిప్పులు చెరిగారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. గురువారం ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. హింస, విధ్వంసం, అరాచకం, అన్యాయం, అక్రమం, అవినీతి గురించి జగన్ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. ఒక రకంగా తమకు రోత పుట్టిస్తోందన్నారు నారా లోకేష్.
బాధితులనే నిందితులు చేసి గవర్నమెంట్ టెర్రరిజానికి పాల్పడిన ఆ చీకటి రోజులు రాష్ట్రంలో పోయి నెల దాటిందని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం మిగిలిన ఆ అరాచకపు ఆనవాళ్లను కూడా కూకటివేళ్లతో పెకిలించి వేస్తోందని చెప్పారు.
ప్రజా తీర్పుతో ఉనికి కోల్పోయిన జగన్…తాను పేటెంటు పొందిన ఫేక్ ప్రచారాలతో అబద్దపు పునాదులపై మళ్లీ నిలబడాలని చూస్తున్నాడని ఆరోపించారు. అందుకే రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా హత్యా రాజకీయాలంటూ ప్రభుత్వానికి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నాడని మండిపడ్డారు నారా లోకేష్.
శవాలతో రాజకీయాలు చేసే మీ విష సంస్కృతికి ప్రజలు ఇచ్చిన తీర్పే మొన్నటి ఎన్నికల ఫలితాలు అని ఇంకా అర్థం చేసుకోకపోతే ఎలా అని ప్రశ్నించారు. నేరాలు చేసి…మళ్లీ వాటిని వేరే వారిపై నెట్టడం అనే మీ కపట నాటకాలకు కాలం చెల్లిందన్నారు.
ప్రజల రక్షణకు కట్టుబడి ఉన్నామని, ఏ ఘటననూ ఉపేక్షించేది లేదని,.ఏ నిందితుడినీ వదిలేది లేదని హెచ్చరించారు. బెంగళూరు యలహంక ప్యాలెస్‌లో కూర్చుని ఇక్కడ కుట్రలు అమలు చేయాలంటే కుదరదని అన్నారు.