సర్కార్ మోసం రైతులకు శాపం
నిప్పులు చెరిగిన నిరంజన్ రెడ్డి
హైదరాబాద్ – మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. మోస పూరితమైన హామీలతో పవర్ లోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా అబద్దాలతో పాలన సాగిస్తోందని ఆరోపించారు. రూ. 6 వేల కోట్లతో రుణ మాఫీ అవుతుందా అని ప్రశ్నించారు.
ఇవాళ రూ 1 లక్ష రుణ మాఫీ చేశామని చెబుతూ ఆగస్టు పూర్తయ్యే లోపు రూ. 2 లక్షలు రుణాలు మాఫీ చేస్తామని చెప్పడం ప్రజలను మోసం చేయడం కాదా అని మండిపడ్డారు నిరంజన్ రెడ్డి. గోబెల్స్ ప్రచారంలో మించి పోయిందన్నారు.
యాసంగి రైతు బంధులోనే రూ.2 వేల కోట్లు ఎగ్గొట్టారని ఆరోపించారు. రైతు భరోసా ప్రకారం చూస్తే రూ.6 వేల కోట్లు ఎగ్గొట్టారని తేలి పోయిందన్నారు మాజీ మంత్రి. ఇక వానాకాలం రైతు భరోసా ఊసే లేదన్నారు. .కోటి 30 లక్షల ఎకరాలకే ఇస్తారనుకున్నా రైతులకు ఎకరాకు రూ.7500 చొప్పున రూ.10 వేల కోట్లు ఎగ్గొట్టారంటూ ఫైర్ అయ్యారు మాజీ మంత్రి.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో కోటి 73 లక్షల మంది మహిళలకు ఏడు నెలలుగా నెలకు రూ.2500 చొప్పున బాకీ పడిందన్నారు. దీనిని అమలు చేయాలంటే ఏడాదికి కనీసం రూ. 41 వేలకు పైగా కావాల్సి ఉంటుందన్నారు.