అపరిచిత ఫోన్స్ కాల్స్ పట్ల జాగ్రత్త
హెచ్చరించిన తెలంగాణ డీజీపీ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర పోలీస్ బాస్ జితేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. అపరిచిత వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఈ మధ్యన కొందరు పోలీస్ ఆఫీసర్స్ ఫోటోలను డీపీలుగా పెట్టుకుని బెదిరింపులకు పాల్పడడం, డబ్బులను లూటీ చేయడం జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
శుక్రవారం రాష్ట్ర డీజీపీ జితేందర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. పోలీస్ డీపీ ఫోటో పెట్టుకొంటూ బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఫోన్ చేసి మీకు సంబంధించిన వాళ్లు పట్టుబడ్డారని, వారి పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్ల ద్వారా వచ్చాయని బెదిరిస్తున్నారని స్పష్టం చేశారు.
అంతే కాకుండా వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు చేసినట్లు భయపెట్టిస్తున్నారని, మిమ్మల్ని ఒత్తిడికి లోను చేసి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయడంతో పాటు డబ్బులు జమ చేయాలని కోరుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు వెల్లడించారు డీజీపీ జితేందర్.
అలాంటి అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు పోలీస్ బాస్.