రైతును అవమానించిన మాల్ మూసివేత
సంచలన నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
బెంగళూరు – పంచె కట్టుకున్నాడని తమ మాల్ లోకి రాకుండా అవమానించిన బెంగళూరు మాల్ కు కోలుకోలేని షాక్ తగిలింది. రైతు పట్ల అవమానకరంగా ప్రవర్తించడంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. దీనిని సీరియస్ గా తీసుకుంది కర్ణాటక రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం.
రైతుకు లోపలికి వచ్చేందుకు అభ్యంతరం తెలపడమే కాకుండా అవమానానికి గురి చేసినందుకు గాను బెంగళూరు మాల్ ను మూసి వేయాలని ఆదేశించింది సర్కార్. ఒక రకంగా చెప్పాలంటే సంచలన నిర్ణయం అని చెప్పక తప్పదు.
ఈ సందర్బంగా ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. బెంగళూరు మాల్ పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏడు రోజుల పాటు మాల్ ను మూసి వేస్తామని రాష్ట్ర మంత్రి బైరతి సుభేష్ అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. ఈ సంఘటన పట్ల శాసన సభలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. పార్టీలకు అతీతంగా రైతును , ఆయన వస్త్రధారణను అవమానించడాన్ని తీవ్రంగా తప్పు పడుతూ నిరసన వ్యక్తం చేశారు సభ్యులు.
జీటీ వరల్డ్ మాల్ లో జరిగిన ఈ ఘటన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించ లేని పరువు, ఆత్మ గౌరవానికి భంగం వాటిల్లిందని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కర్ణాటక లోని హవేరీ జిల్లాకు చెందిన ఫకీరప్ప తన కుటుంబంతో కలిసి సినిమా చూసేందుకు మాల్ కు వచ్చాడు. పంచ కట్టుకుని రావడంతో ఆయనకు ప్రవేశం నిరాకరించారు. దీనిని కొడుకు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇది దేశ వ్యాప్తంగా వైరల్ గా మారింది. దీంతో ప్రభుత్వం రంగంలోకి దిగింది.
ఈ ఘటనపై హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని కోరారు ఎమ్మెల్యేలు. తన తొమ్మిది మంది పిల్లలందరినీ విజయవంతంగా చదివించిన ఈ రైతు సాంప్రదాయ దుస్తులకు కట్టుబడి ఉన్నందుకు గౌరవించాలన్నారు ఎమ్మెల్యే కోలివాడ్. బెంగళూరులో ఉన్న అన్ని షాపులు, మాల్స్ లు, ఇతర దుకాణాలకు సర్కార్ సర్క్యులర్ జారీ చేయాలని కోరారు.