శ్రీవాణి టికెట్ల కోటా 1000కి కుదింపు
ప్రకటించిన టీటీడీ ఈవో శ్యామల రావు
తిరుమల – టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా శ్రీవాణి దర్శనం టికెట్లకు సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఈవో జె. శ్యామల రావు. జూలై 22వ తేదీ నుండి ఆఫ్ లైన్ లో శ్రీవాణి దర్శనం టికెట్ల కోటాను రోజుకు 1000కి పరిమితం చేసినట్లు స్పష్టం చేశారు.
ఆన్ లైన్ లో 500 టికెట్లు తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా, సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఈవో . ప్రతి రోజుకు వెయ్యికి మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపారు .
ఇందులో భాగంగా ఆన్ లైన్ లో 500 (ఇదివరకు ఉన్నట్లే ) ఆఫ్ లైన్ లో మరో 1,000 టికెట్లను మాత్రమే జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు జె. శ్యామల రావు. తిరుమల లోని గోకులం విశ్రాంతి భవనంలో 900 శ్రీవాణి టికెట్లను మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికగా జారీ చేస్తామని స్పష్టం చేశారు.
మిగిలిన 100 టికెట్లను శ్రీవాణి దాతలకు విమానాశ్రయంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. బోర్డింగ్ పాస్ ద్వారా తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో మాత్రమే ఈ ఆఫ్లైన్ టిక్కెట్లు జారీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. .భక్తులు ఈ విషయాన్ని గమనించి టీటీడీకి సహకరించాలని విన్నవించారు జె. శ్యామల రావు.